
అహంకారం | పెద్దలు చెప్పిన నీతి కథ | Pride | Arrogance
ఆ గ్రామం పేరు పాండురంగాపురం.
ఓ రోజు ఆ గ్రామంలో ఉన్న జంతువులన్నీ పిచ్చాపాటిగా సమావేశమయ్యాయి.
ఆ సమావేశంలో జంతువులు తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి.
అప్పుడు అక్కడున్న కుక్కలు “ఈ గ్రామములో దొంగలు పడకుండా మేము ఎంతైనా కాపాడుతూ ఉన్నాము. ఎవరైనా కొత్తవారు గానీ, దొంగలు గానీ ఈ గ్రామంలో ప్రవేశించిన యెడల మేము యజమానులను అలర్ట్ చేసి నిద్ర నుంచి లేపుతాము. ఆ విధంగా, మా యజమానుల ఆస్తులను రక్షిస్తూ ఉంటాము” అని చెప్పాయి.
అప్పుడు అక్కడ ఉన్న పిల్లులు ఇలా అన్నాయి “మేము ఇళ్ళలో ఏవైనా ఎలుకలు చొరబడి ధాన్యమును తినకుండా, మరియు గోడలకు రంధ్రం చేయకుండా కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా మేము యజమానులకు గొప్ప సహాయం చేస్తూ ఉంటాము” అని చెప్పాయి.
అప్పుడు అక్కడున్న బల్లులు కూడా ఈ విధంగా అన్నాయి. “ఇంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే చిన్న చిన్న క్రిమికీటకాలు ఉత్పత్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని తినేస్తాం. మేము ఈ విధంగా ఇంటి యజమాని,కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాము” అని చిన్నగా చెప్పాయి.
అప్పుడు అక్కడ ఉన్నటువంటి కోడిపుంజు లేచి, “మేము ఊరికి చాలా ముఖ్యమైన వారము. మేము కూసే కూతకు గ్రామ ప్రజలు నిద్రనుంచి లేచి తమ యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపక్రమిస్తుంటారు. కనుక మేము కూత వేయకపోతే గ్రామ ప్రజలు నిద్ర లేయకుండా సోమరిపోతుగా ఉంటారు. కనుక మేము చేసే పని చాలా గొప్పది. ఇంటి యజమానులు సైతం, అందరూ ఈ విధంగా తమపై ఆధారపడి ఉన్నారు” అని కోడిపుంజు గర్వంగా చెప్పినది.
అహంకారం:
కోడిపుంజు చెప్పిన విధానము గర్వము, అహంకారము ఉన్నట్లుగా అక్కడ ఉన్న జంతువులకు తోచినది. అప్పుడు ఒక రామచిలక కోడిపుంజు అహంకారం ను ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఒక పథకం వేసినది.
“కోడి బావా, కోడి బావా, మీ ఆధారంతో ఇంటి యజమాని లేచి తన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నారని మీరు మిక్కిలి గట్టిగా చెబుతున్నారు. సంతోషం, అయితే మీరు గ్రామ ప్రజలను మీరు అనుకున్న సమయంలో లేప గలరా?” అని అడిగినది.
అందుకు కోడిపుంజు “విర్రవీగిన గర్వంతో మేము ఏ సమయము అనుకుంటే ఆ సమయంలో ఈ గ్రామ ప్రజలను లేపగలం” అని ప్రగల్భాలు పలికినది. కావాలంటే వారిని ఏ సమయంలో లేపాలో మీరే నిర్ణయించండి. అన్నది.
అప్పుడు రామచిలక, కోడిపుంజు గర్వము ఎలాగైనా అణచాలి అనే ఉద్దేశంతో “మీరు అర్ధరాత్రి 12 గంటలకు మీ యజమానిని లేపండి చూద్దాం. అలా చేయగలిగినట్లైతే మిమ్ములను ఈ ఊరి జంతువులకు నాయకునిగా నియమించుకుంటాము.”అని అన్నది.
ఈ ప్రపోజల్ కు జంతువులు అన్నీ అంగీకరించాయి.
ఈ సవాలును పుంజు సంతోషంగా స్వీకరించింది.
అదే రోజు రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కోడిపుంజు “కుక్కటీ కుర్ర్, కుక్కటీ కుర్ర్” అంటూ ఏకధాటిగా అరవడం ఆరంభించింది.
పగలంతా వ్యవసాయ పనులతో అలసి పోయిన రైతు నిద్రాభంగం కలిగి పుంజును కేక వేసి తిట్టసాగాడు. అయినప్పటికీ కోడిపుంజు అరవడం ఆపలేదు.
అందుకు కోపగించిన ఇంటి యజమాని వెంటనే ఒక దుడ్డుకర్ర తీసుకుని కోడి పుంజు వైపు విసిరాడు.
అయితే అక్కడికి అప్పుడే చేరుకున్న జంతువులను గమనించిన కోడిపుంజు ప్రిస్టేజ్ ఫీల్ అయి ఇంకా అరవడం ఎక్కువ చేసింది.
అప్పుడు, రామచిలక “కోడిబావా, మీ యజమాని తప్ప ఊళ్ళో ఎవరూ లేవలేదు ఆ విషయం గమనించారా?” అని అడిగింది.
అందుకు రెచ్చిపోయిన కోడిపుంజు మరింత గట్టిగా అరవసాగింది. తన శక్తినంతా కూడగట్టుకొని దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా అరిచినప్పటికీ ఎవరూ లేవలేదు. అరచి, అరచి అలసి పోయిన పుంజు సొమ్మసిల్లి పడిపోయింది. భరించలేని డొక్కల నొప్పితో ప్రాణాలు సైతం వదిలింది.
అహంకారం | పెద్దలు చెప్పిన నీతి కథ:
ఇందులో, ఈ కథలో నీతి, ఎవరైనా అహంకారంతో విర్రవీగి అహంకారంతో మాట్లాడితే తన ప్రాణానికి ముప్పు తెచ్చుకునే అవకాశం ఉన్నది.
Please share to whatsapp by clicking “+” button down